Kalidindi : లో-వోల్టేజ్ సమస్యలకు చెక్.. కొండంగిలో రూ.4.95 కోట్ల విద్యుత్ సబ్‌స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డా. కామినేని
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :
మండలంలోని కొండంగి గ్రామంలో రూ.4.95 కోట్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కైకలూరు ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ డా. కామినేని శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో కొండంగి పరిసర గ్రామాల్లో లో-వోల్టేజ్ సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు గృహ, ఆక్వా, వ్యవసాయ రంగాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుంది.
ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ..
కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తోందన్నారు. నియోజకవర్గంలో విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేయడంలో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లు నిర్మించామని తెలిపారు. ప్రజలు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో కొండంగి సబ్‌స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.
ఇప్పటివరకు కలిదిండి, మూలలంక సబ్‌స్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా కావడంతో లో-వోల్టేజ్, విద్యుత్ అంతరాయాల సమస్యలు ఎదురయ్యేవని తెలిపారు. కొండంగి నుంచే విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో సరఫరా సామర్థ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. సరైన వోల్టేజ్‌తో విద్యుత్ అందడంతో ఆక్వా రైతులు, వ్యవసాయదారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కొండంగి లిఫ్ట్ స్కీమ్‌కు ప్రత్యేక విద్యుత్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
గృహ, వాణిజ్య వినియోగదారులకు కూడా సబ్‌స్టేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని, లో-వోల్టేజ్ సమస్యలు తగ్గడంతో విద్యుత్ ఆధారిత గృహోపకరణాల వినియోగం సులభతరం అవుతుందని అన్నారు. ఆక్వా రైతులకు కొత్త విద్యుత్ కనెక్షన్లు, పాత సర్వీసులకు అదనపు లోడ్ పెంచుకునే అవకాశం కూడా మెరుగుపడుతుందని తెలిపారు.
కొండంగి, కొండంగి పల్లిపాలెం, యడవల్లి, మట్టుగుంట గ్రామాలకు సబ్‌స్టేషన్ ద్వారా ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. కలిదిండి, మూలలంక సబ్‌స్టేషన్లపై లోడ్ తగ్గడం ద్వారా వాటి పరిధిలోని ఇతర గ్రామాలకు కూడా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందే అవకాశం ఉంటుందని తెలిపారు. అదనంగా మరో 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసిన అనంతరం అమరావతి, సంతోషపురం గ్రామాలకు కూడా మెరుగైన విద్యుత్ సరఫరా అందించనున్నట్లు వెల్లడించారు.
కొండంగి సబ్‌స్టేషన్ పరిధిలో మొత్తం 3,311 విద్యుత్ సర్వీసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటిలో 2,670 గృహ, 632 ఆక్వా, 145 వ్యాపార, 64 ఇతర సర్వీసులు ఉన్నాయి.
ఈ నెల చివరి వారంలో 220 కేవీ గోపవరం సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నట్లు కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవిని ఆహ్వానించి ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొత్త నాగేంద్రకుమార్, విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
