Kalidindi : స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : అండ్రాజు శ్రీను
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :
విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడటం తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు అన్నారు.
మంగళవారం కలిదిండి మండలంలోని మట్టగుంట గ్రామంలో ఆయన మాట్లాడుతూ...
మెగా DSC-2025 ద్వారా ఉద్యోగాలు పొందిన స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, మెడల్స్‌తో తమ అర్హతలను వివరించేందుకు వచ్చిన సమయంలో వారిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడటం బాధాకరమన్నారు. అర్హతలపై అనుమానాలు ఉంటే ఆధారాలతో అధికారులను లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి కానీ, ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు.
నియామక ప్రక్రియపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా చట్టపరంగా పరిష్కరించుకోవాలని, రాజకీయ ఆందోళనల పేరుతో ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని సూచించారు.
ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన వైసీపీనాయకులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, DSC ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించాలని అండ్రాజు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు.
కార్యక్రమంలో కూటమి నాయకులు తిరుమల శెట్టి వెంకటేశ్వరరావు, కోపనాతి శ్రీను, తిరుమల శెట్టి ఈశ్వర పరుశురాముడు, కోపనాతి రాము, తిరుమల శెట్టి రామారావు తదితరులు పాల్గొన్నారు.
