Machilipatnam : ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
- ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
- పథకాలను సద్వినియోగం చేసుకుని సవాళ్లను అవకాశాలుగా మలచుకోవాలి
- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపు
- కార్యక్రమానికి ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి తరలివచ్చిన పారిశ్రామికవేత్తలు
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :
ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్తను తీర్చిదిద్దడం ద్వారా ఉద్యోగార్థులను ఉద్యోగదాతలుగా మార్చడమే ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అన్నారు.
సోమవారం జిల్లా యంత్రాంగం, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో ‘ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త – ఎంఎస్ఎంఈ గ్రోత్’ అంశంపై ఒకరోజు కార్యశాలను నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే వ్యాపారం నిర్వహిస్తున్నవారితో పాటు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
కృష్ణా జిల్లాతో పాటు హైదరాబాద్, కడప, కర్నూలు, తిరుపతి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, గుంటూరు తదితర జిల్లాల నుంచి పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాల్మార్ట్ వృద్ధి, మెటా (వాట్సాప్), అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు వ్యాపారాభివృద్ధి, డిజిటల్ మార్కెటింగ్, మార్కెట్ లింకేజీలపై శిక్షణ అందించారు. బ్యాంకర్లు, తపాలా శాఖ ప్రతినిధులు తమ శాఖల ద్వారా అందుబాటులో ఉన్న సేవలు, అవకాశాలను వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
వ్యాపార రంగంలో విజయవంతమైన వారికి ఒక మంచి పరిచయం, ఒక ఆలోచన లేదా ఒక అవకాశం జీవితాన్ని మార్చగలదని అన్నారు. ఈ కార్యశాల ద్వారా ఔత్సాహికులకు అలాంటి పరిచయాలు, కొత్త ఆలోచనలు, వ్యాపార అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఒక వ్యాపారం అభివృద్ధి చెందితే దాని ద్వారా పలువురికి ఉపాధి లభిస్తుందని, వారి ఆదాయం పెరిగి ఇతర రంగాల్లో ఖర్చు చేయడం ద్వారా మరిన్ని వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ వివరించారు. ఉత్పత్తి, పెట్టుబడి, మార్కెటింగ్ అంశాలను సమర్థవంతంగా నిర్వహించడం విజయవంతమైన వ్యాపారానికి కీలకమని చెప్పారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ధీరూభాయ్ అంబానీ విజయగాథను ప్రస్తావిస్తూ, పరిమిత వనరులతో ప్రారంభించిన ఆయన సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. అలాగే సైకిల్ ప్యూర్ అగరబత్తి సంస్థ అధినేత ఎన్. రంగారావు, కమానీ ట్యూబ్స్ సంస్థ ఛైర్పర్సన్ కల్పనా సరోజ్ వంటి పారిశ్రామిక దిగ్గజాల విజయగాథలు ఔత్సాహికులకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అనేక రకాలుగా సహకరిస్తోందని, పీఎంఈజీపి, పీఎంఎఫ్ఎంఈ వంటి పథకాల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు, శిక్షణ, సాంకేతిక సహాయం వంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడం వల్ల ఏర్పడుతున్న అంతరాన్ని తొలగించేందుకే ఈ కార్యశాలను నిర్వహించినట్లు చెప్పారు.
కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ముందుకు వస్తే ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపొందించడం నుంచి రుణ సదుపాయం పొందే వరకు జిల్లా పరిశ్రమల శాఖ, సాంకేతిక బృందం సహకారం అందిస్తాయని హామీ ఇచ్చారు. అలాగే స్థానిక పారిశ్రామికవేత్తల ఉత్పత్తులను పెద్ద సంస్థలు, కొనుగోలుదారులతో అనుసంధానం చేసేందుకు అవసరమైన సమావేశాలు ఏర్పాటు చేయడంలో జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని తెలిపారు.
వ్యాపారంలో నెట్వర్కింగ్, సరైన పరిచయాలు, మార్కెట్ లింకేజీలు ఎంతో కీలకమని, ఔత్సాహికులకు అవసరమైన సంస్థల ప్రతినిధులతో మళ్లీ అనుసంధానం చేసేందుకు కూడా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కార్యశాలలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ, వ్యాపార నిర్వహణ, ప్రభుత్వ పథకాలు, మార్కెటింగ్, రుణ సదుపాయాలు, మార్కెట్ లింకేజీలపై విలువైన అవగాహన లభించిందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఎంఎస్ఎమ్ఈ ఈడి ఏ సుధాకర్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్ వెంకట్రావు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం కే జోగారావు, తపాల శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇండియా ఎస్ఎంఈ పార్ట్నర్ నాగేశ్వరరావు, కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి కూన రామ్ జీ, డిఆర్డిఏ, మెప్మా పీడీలు హరిహరనాథ్, సాయిబాబు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ బాబ్జి, లీడ్ బ్యాంక్ మేనేజర్ సి రవీంద్రారెడ్డి, ఉద్యాన శాఖ అధికారిణి జె జ్యోతి, వివిధ కంపెనీల ప్రతినిధులు ట్రైనర్లు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
