Machilipatnam : మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం – ఎంపీ బాలశౌరి హర్షం
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ఎంపీ కార్యాలయం : స్వచ్ఛవార్త :
మచిలీపట్టణం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గోవా షిప్‌యార్డు లిమిటెడ్ ఆధ్వర్యంలో భారీ రక్షణ, నౌకా నిర్మాణ ప్రాజెక్టు ఏర్పాటుకు బుధవారం రాష్ట్ర కేబినెట్ లో ఆమోదం తెలపడంపై మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి హర్షం వ్యక్తం చేశారు. ఈ కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర కేబినెట్‌కు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
సుమారు రూ.8,000 కోట్ల పెట్టుబడితో మచిలీపట్టణం పోర్టు కేంద్రంగా గోవా షిప్‌యార్డు ఏర్పాటు కానుండటం నియోజకవర్గ పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత కలిగిన పరిణామమని బాలశౌరి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 3,000 మందికి ప్రత్యక్షంగా, 5,000 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు.
గోవా షిప్‌యార్డు లిమిటెడ్ చేపడుతున్న ఈ విస్తరణ ప్రాజెక్టు మచిలీపట్టణాన్ని రక్షణ, నౌకా నిర్మాణ రంగంలో కీలక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ అవసరాలకు అనుగుణంగా నౌకా నిర్మాణం, మరమ్మతుల కార్యకలాపాలకు ఈ ప్రాజెక్టు దోహదపడనుంది.
