📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : డ్రగ్స్ వినియోగం, అక్రమ విక్రయాల నియంత్రణకు సమగ్ర చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

  • జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశ సమీక్ష

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :

జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ విక్రయాలను సమర్థవంతంగా అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. 

సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడుతో కలిసి ఈగల్, పోలీస్, విద్య, వైద్య తదితర శాఖల అధికారులతో నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించి డ్రగ్స్ నియంత్రణ చర్యలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 

విద్యాశాఖ అధికారులు సాధారణ తనిఖీలతో పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు, తరగతులకు గైర్హాజరు, అనుమానాస్పద స్నేహ సంబంధాలు వంటి అంశాలను గమనించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు సంబంధించిన అనుమానాస్పద సమాచారాన్ని గోప్యంగా అధికారులకు అందించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు.

విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన ప్రాథమిక లక్షణాలను గుర్తించిన వెంటనే వారిపై క్రిమినల్ చర్యలకు బదులుగా అవసరమైన సందర్భాల్లో కౌన్సెలింగ్, డీ-అడిక్షన్ సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులకు, ముఖ్యంగా తల్లులకు పిల్లలపై నిరంతర పర్యవేక్షణ, వారి స్నేహాలు, రోజువారీ కార్యకలాపాలు, ఇంటికి వచ్చే సమయాలు తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.

మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ప్రభావవంతమైన లఘు వీడియోలను రూపొందించి పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం నుంచి బయటపడి జీవితాన్ని మార్చుకున్న వ్యక్తుల అనుభవాలను గుర్తింపు వెల్లడికాకుండా అవగాహన కార్యక్రమాల్లో వినియోగించే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు.

వలస కార్మికుల విషయంలోనూ సమగ్ర సమాచార సేకరణ, ధృవీకరణ ప్రక్రియను కొనసాగించాలని తెలిపారు. మత్స్య, వ్యవసాయ, హోటల్ తదితర రంగాల్లో పనిచేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కార్మికుల వివరాలను సంబంధిత శాఖల సమన్వయంతో నమోదు చేసుకోవాలని సూచించారు.

జాతీయ రహదారుల వెంట ఉన్న దాబాలు, ఇతర వాణిజ్య సంస్థలు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడుతున్నాయా లేదా పరిశీలించాలని, మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన సంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వాణిజ్య సంస్థలపై సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. 

విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు పాఠశాలలు , కళాశాలల పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యాసంస్థల చుట్టూ 500 మీటర్ల పరిధిలోని టీ దుకాణాలు, బడ్డీ షాపులు, స్టేషనరీ దుకాణాలు, ఫార్మసీలు తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. గంజాయి, రోలింగ్ పేపర్లు, వేపింగ్ పరికరాలు, ఇతర అనుమానాస్పద పదార్థాల విక్రయాలపై నిఘా ఉంచాలని సూచించారు.

మాదకద్రవ్యాల నియంత్రణలో పోలీసు శాఖతో పాటు విద్య, మత్స్య, వ్యవసాయ, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి క్షేత్రస్థాయిలో సమాచారం నిరంతరం అందడం అత్యంత కీలకమన్నారు. ఈగల్ బృందాల పనితీరును మరింత సమర్థవంతం చేసి అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచార సేకరణ, నిఘాను పెంచాలని సూచించారు.

సమావేశంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ బడేటి సత్య ప్రకాష్, అదనపు ఎస్పీ వి వి నాయుడు, స్పెషల్ బ్రాంచ్ సిఐ సత్య కిషోర్, వ్యవసాయ శాఖ జేడి జ్యోతి రమణి, కలెక్టరేట్ తహసిల్దార్ హరనాథ్, విద్య, వైద్య, పోలీస్, ఈగల్ బృందాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం