T. Narasapuram : టి.నర్సాపురంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ఊరేగింపు...
ఏలూరు జిల్లా : టి. నరసాపురం : స్వచ్ఛవార్త :
టి.నరసాపురం, గండిగూడెం గ్రామాల విశ్వబ్రాహ్మణ సంఘాల వారి ఆధ్వర్యంలో దేవతల ఇంజనీర్, శిల్పి విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని బంధం చర్ల రోడ్డులోని శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, జెండా ఆవిష్కరణ, ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు లక్కోజు నాగాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్కోజు నాగేశ్వరరావు, లక్కోజు సుబ్బారావు దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ - దేవతల ఇంజనీర్, శిల్పి విశ్వకర్మ, దేవతల కోసం ఆయుధాలు, భవనాలు, పుష్పక విమానం, ద్వారకా నగరం అన్నీ ఆయనే నిర్మించారని పురాణాలు చెబుతున్నాయని, కుల మతాలకతీతంగా ఆయన పుట్టినరోజును దేశవ్యాప్తంగా కార్మికుల దీపావళిగా జరుపుకుంటారని తెలిపారు.
ఫ్యాక్టరీలు, వర్క్ షాపులు, మెషిన్ షాపులు, భవన నిర్మాణ కార్మికులు, వడ్రంగులు, కమ్మరులు, ఎలక్ట్రీషియన్లు, మెకానిక్ లు అందరికీ ఇది పెద్ద పండుగ అని, తాము నమ్ముకున్న యంత్రాలకు, పనిముట్లకు పూజ చేస్తారని, ఒక విధంగా చెప్పాలంటే చేతివృత్తుల వారికి కులదైవం విశ్వకర్మ అని తెలిపారు.
అనంతరం టి.నరసాపురం, గండిగూడెం ప్రధాన వీధుల లో మేళతాళాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు.
కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు కొక్కొండ శ్రీనివాసచారి, కొక్కొండ భూషణాచారి, శ్రీపాద వెంకటాచారి, కుందవరపు శ్రీనివాసచారి, రాయలవరపు చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.
