Avanigadda : సేవాసేతు అభియాన్ సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
కృష్ణా జిల్లా : అవనిగడ్డ (స్వచ్ఛవార్త) :
సోలార్ విద్యుత్తు వినియోగం పెంచడమే లక్ష్యంగా సింగిల్ డెస్క్ విధానంలో ప్రభుత్వం చేపట్టిన సేవాసేతు అభియాన్ సద్వినియోగం చేసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. సోమవారం అవనిగడ్డలో ఎమ్మెల్యే తమ కార్యాలయంలో సేవాసేతు అభియాన్ కరపత్రాలు ఆవిష్కరించారు.
ఈ నెల 6,7,8 తేదీల్లో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల విద్యుత్ వినియోగదారుల కోసం అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో, చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల విద్యుత్ వినియోగదారుల కోసం చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో సేవాసేతు అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నియోజకవర్గంలోని విద్యుత్ వినియోగదారుల కోసం పీఎం సూర్య ఘర్ - సోలార్ విద్యుత్తు వినియోగంపై అవగాహన, దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేసే ఉద్దేశంతో ఈ వేదిక ద్వారా విద్యుత్ వినియోగదారులు పీఎం సూర్య ఘర్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు అందుబాటులో ఉండి వినియోగదారులకు సహకరిస్తారని తెలిపారు.
వీరితో పాటు పలు బ్యాంకుల అధికారులు కూడా ఈ మూడు రోజులు సదస్సులో పాల్గొని వినియోగదారులకు అవసరమైన రుణ సదుపాయాలు కూడా కల్పిస్తారని తెలిపారు. సింగిల్ డెస్క్ విధానంలో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం అందించే సబ్సిడీతో సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకొని తమ విద్యుత్తు ఖర్చులు తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చల్లపల్లి ఏడీఈ పేర్ని రవికుమార్, ఘంటసాల ఏఈ పిరియా రవికుమార్ పాల్గొన్నారు.
