Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో 11 నుంచి శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
రోజుకో అలంకారంలో అమ్మవారి దర్శనం.. 20న విజయదశమి, 22న అన్నసమారాధన
ప.గో జిల్లా : భీమవరం ( స్వచ్ఛవార్త) :
భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నాగేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
రోజుకో ప్రత్యేక అలంకారం :
శరన్నవరాత్రుల మొదటి రోజైన అక్టోబర్ 11న స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా, 12న బాలా త్రిపురసుందరీ దేవిగా, 13న గాయత్రీ దేవిగా, 14న అన్నపూర్ణా దేవిగా, 15న సరస్వతీ దేవిగా, 16న మహాలక్ష్మీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 17న మూలా నక్షత్రం సందర్భంగా దుర్గాదేవి అలంకారం, 18న మహిషాసురమర్దినీ దేవి అలంకారం, 19న రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 20న విజయదశమి వేడుకలు నిర్వహించనున్నారు.
ప్రతిరోజూ కుంకుమ పూజలు, చండీ హోమం :
నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం అమ్మవారికి కుంకుమ పూజలు, సాయంత్రం చండీ హోమం నిర్వహించనున్నారు. విజయదశమి రోజున మధ్యాహ్నం 1 గంటకు గ్రామోత్సవం జరగనుంది.
22న అన్నసమారాధన :
అక్టోబర్ 22న ఉదయం 11 గంటల నుంచి అన్నసమారాధన నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. భక్తులు తమ అభీష్టం మేరకు దేవస్థానంలో వివిధ రకాల పూజలు చేయించుకోవచ్చని పేర్కొన్నారు.
మండల దీక్ష ప్రారంభం :
అక్టోబర్ 26న అమ్మవారి మండల దీక్ష ప్రారంభమై, డిసెంబర్ 5న దీక్ష విరమణ, పూర్ణాహుతి కార్యక్రమాలతో ముగియనుంది. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తల మండలి సభ్యులు కోరారు.
