Bhimavaram : బీసీల రాజకీయ ప్రాధాన్యతకు టీడీపీ కట్టుబడి ఉంది : "కేఎన్ఆర్"
- బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల దిశగా ఎన్డీఏ కూటమి నిర్ణయం.. యువతలో చైతన్యం తీసుకురావాలి
ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) :
బీసీల ఆత్మగౌరవం, ఆర్థిక అభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ కట్టుబడి ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్ఆర్) అన్నారు. శనివారం భీమవరంలో తోట సీతారామారావు ఆధ్వర్యంలో బీసీ నాయకులు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించడంలో టీడీపీ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
బీసీలకు రాజకీయ గుర్తింపు కల్పించిన ఎన్టీఆర్ :
ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా బీసీలకు రాజకీయ అధికారం, సామాజిక గుర్తింపు కల్పించాలనే ఆలోచనకు ఎన్టీఆర్ పునాది వేశారని కేఎన్ఆర్ అన్నారు. నేషనల్ ఫ్రంట్ హయాంలో మండల్ కమిషన్ సిఫార్సుల అమలు, బీసీలకు రిజర్వేషన్ల కల్పనలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందని వివరించారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యనమల రామకృష్ణుడు, కింజరాపు ఎర్రన్నాయుడు, దేవేందర్ గౌడ్ వంటి బీసీ నాయకులకు ప్రాధాన్యత లభించిందని పేర్కొన్నారు.
బీసీల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన, రాజకీయ ఎదుగుదలపై యువతకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. బీసీలకు తెలుగుదేశం పార్టీ చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై ప్రస్తావన :
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకుందని కేఎన్ఆర్ తెలిపారు. ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారని విమర్శించారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించాలని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో బీసీలకు సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యత కల్పించే విషయంలో అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారం, ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
భీమవరం బీసీ నాయకులకు ఉన్నత పదవులు రావాలి :
భీమవరం ప్రాంతానికి చెందిన బీసీ నాయకులు గతంలో ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ వంటి పదవుల్లో సేవలందించారని కేఎన్ఆర్ గుర్తుచేశారు. బొమ్మిడి ఆనందరావు వంటి నాయకులు వివిధ హోదాల్లో ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ భీమవరం ప్రాంత బీసీ నాయకులకు ఉన్నత పదవులు లభించాలని ఆకాంక్షించారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల దిశగా ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాన్ని నిర్వహించిన తోట సీతారామారావు, బీసీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
