Eluru : రాష్ట్ర అభివృద్ధి కుతమితోనే సాధ్యం : ఎంపీ పుట్టా మహేష్
- దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి..
- ఏటా 32,000 కోట్లకు పైగా పెన్షన్లకు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం..
- 15-20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది..
- చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం..
ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : స్వచ్ఛవార్త :
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాలను కూడా సమానంగా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళుతున్నామని, ఈ అభివృద్ధి కొనసాగాలంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఓటువేసి గెలిపించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. గురువారం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా అయ్యపరాజు గూడెం నుంచి కలరాయణగూడెం వరకు రెండున్నర కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శంకుస్థాపన చేశారు.
అనంతరం అయ్యపరాజుగూడెంలో పెన్షన్ల పంపిణీ లో పాల్గొని, "పేదల సేవలో 2.0" పేరుతో నిర్వహించిన గ్రామ సభలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ..
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో వివిధ వర్గాల వారికి నెలకు 4 వేల నుంచి 15 వేల వరకూ పెన్షన్లు ఇస్తూ, ఏటా పెన్షన్ల కోసమే 32 వేల కోట్లు ఖర్చుపెడుతున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అన్నారు. ఏలూరు పార్లమెంటులో అన్ని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, స్మశానవాటికల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని, పొగాకు, పామాయిల్, కోకో రైతుల సమస్యలను పరిష్కరించామని తెలిపారు. అభివృద్ధికి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తున్న ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఒకే ప్రభుత్వం 15-20 సంవత్సరాలు అధికారంలో ఉంటే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనడానికి గుజరాత్ రాష్ట్రమే ఒక ఉదాహరణ అన్నారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు తొలగిపోయాయని, ప్రాజెక్టు పనులు త్వరలోనే మొదలవుతాయనీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. సగం పైగా పూర్తయ్యి, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. తాజాగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, త్వరగా పనులు మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని ఎంపీ తెలిపారు.
చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే చింతలపూడి, నూజివీడు నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాలకు సమృద్ధిగా నీరు అందుతుందని, కాలువలు చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని, తాగునీటి సమస్యలు కూడా తీరుతాయని ఎంపీ తెలిపారు.
