📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Gudlavalleru : 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో కొండలమ్మ


  • 18న 30 వేల మందికి అఖండ అన్నసమారాధన.. 350 కిలోల బియ్యం విరాళం

కృష్ణా : గుడ్లవల్లేరు/వేమవరం (స్వచ్ఛవార్త) : 

దసరా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా వేమవరం గ్రామంలోని భక్తుల ఇలవేల్పు శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో గురువారం ఆశ్వయుజ శుద్ధ పంచమి సందర్భంగా అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ నెల 18న నిర్వహించనున్న అఖండ అన్నసమారాధనకు హైదరాబాద్‌కు చెందిన వేణుగోపాల చార్యులు 250 కిలోల బియ్యం, మరో భక్తుడు 100 కిలోల బియ్యం విరాళంగా అందించారు. మొత్తం 350 కిలోల బియ్యం విరాళంగా అందినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

అభిషేకాలు, లక్ష కుంకుమార్చన :

ఉదయం ప్రాతఃకాల అర్చన, సహస్రనామార్చన, లలితా సూక్త హవనాలు నిర్వహించారు. అనంతరం స్వయంభు అమ్మవారికి వివిధ రకాల ఫలరసాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి లక్ష కుంకుమార్చన, నిరాజన, మంత్రపుష్ప కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం సాయంకాలార్చన, ఉంజల్ సేవ, పంచహారతులు, మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఆలయ చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, ధర్మకర్తల మండలి సభ్యులు తూము రాజ్యలక్ష్మి, గుడ్లవల్లేటి వాణి, కళ్లేపల్లి సుగుణ శేఖర్, వడ్లమూడి రవీంద్రబాబు, మన్నెం వీర నాగేంద్రరావు, ముంగం ఆంజనేయులు, నూతలపాటి లక్ష్మీ పావని, పెద్దిబోయిన శ్యామల దేవి, ఉస్తేల కోటేశ్వరమ్మ, పెన్నేరు వీర వెంకట నాగ లీల శేఖర్, ఈవో ఆకుల కొండలరావు, ముఖ్య అర్చకుడు ఆర్.ఎస్.సి.ఎస్. సంతోష్ శర్మ ఏర్పాట్లను పర్యవేక్షించి పూజల్లో పాల్గొన్నారు.

భక్తులకు వైద్య, భద్రతా ఏర్పాట్లకు అధికారుల చర్యలు :

ఉత్సవాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టి బ్లీచింగ్ పౌడర్, ముగ్గు చల్లించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ గురురాజు ప్రభుత్వ ఉచిత హోమియో వైద్య శిబిరంతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయగా, అగ్నిమాపక శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది.

18న 30 వేల మందికి మహా అన్నసమారాధన :

ఈ నెల 18న ఆదివారం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో కుంభం పోయుట, గ్రామోత్సవంతో పాటు 30 వేల మందికి పైగా భక్తులకు అఖండ అన్నసమారాధన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు ధన, వస్తు రూపాల్లో విరాళాలు అందించి సహకరించాలని ఆలయ చైర్మన్ ఈడే మోహన్, ధర్మకర్తల మండలి సభ్యులు కోరినట్లు ఈవో తెలిపారు.నేటి, రేపటి కార్యక్రమాలు :

గురువారం మధ్యాహ్నం గుడివాడకు చెందిన శ్రీ మురళీకృష్ణ కోలాట భజన సమాజం కోలాట ప్రదర్శన నిర్వహించింది. రాత్రి 7.30 గంటలకు ఏలూరుకు చెందిన కూచిపూడి నాట్య నిలయం నృత్య ప్రదర్శన, 8.30 గంటలకు విజయవాడ శ్రీ సాయి బాలాజీ నాట్యమండలి ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం సన్నివేశం, రాత్రి 10 గంటలకు అవనిగడ్డ జై శ్రీ విజయ నాటక మండలి ఆధ్వర్యంలో ‘ముచ్చటగా ఐదు రత్నాలు’ నాటక ప్రదర్శన జరగనున్నట్లు ఈవో తెలిపారు.

శుక్రవారం ఉదయం 10 గంటలకు విద్యార్థినీ, విద్యార్థులతో సామూహిక సరస్వతీ పూజ నిర్వహించి, అనంతరం అమ్మవారి ప్రసాదంగా పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు :

బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరానికి చెందిన శ్రీ బాల రాజరాజేశ్వరి నృత్యాలయం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించింది. రాత్రి 8 గంటలకు మచిలీపట్నం సాంస్కృతిక విభాగం కళాకారులు శ్రీకృష్ణ రాయబారం నాటకంలోని పడక సీను ప్రదర్శించగా, రాత్రి 9.30 గంటలకు గుడివాడ జై శ్రీ నాట్యమండలి కళాకారులు హాస్యభరిత సన్నివేశాలతో అలరించారు.



షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం