Gudlavalleru : శ్రీ కొండలమ్మ ఆలయ సన్నిధిలో వరుణ జపం, హోమం
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెలసిన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో వరుణ జపం, వరుణ హోమం నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఉదయం 8 గంటలకు అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
దేవస్థాన ముఖ్య అర్చకుడు రుద్రపాక శరశ్చంద్ర శివ సంతోష్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది సమష్టిగా వరుణ జపం, హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, ధర్మకర్తల మండలి సభ్యులు తూము రాజ్యలక్ష్మి, కళ్ళేపల్లి సుగుణ శేఖర్, వడ్లమూడి రవీంద్రబాబు, మన్నెం వీర నాగేంద్రరావు, నూతలపాటి లక్ష్మీ పావని, పెన్నేరు వీర వెంకట నాగ లీల శేఖర్, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
