Gudlavalleru : శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో కొండలమ్మ అమ్మవారు.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. విద్యార్థులకు పుస్తకాల వితరణ
కృష్ణా : గుడ్లవల్లేరు/వేమవరం (వేమవరం) :
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ కొండలమ్మ అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల సకల విద్యాభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఉదయం ప్రాతఃకాలార్చన అనంతరం 8.30 గంటల నుంచి అమ్మవారికి సహస్రనామార్చన, సరస్వతీ మూలమంత్ర హవనాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, యాజ్ఞిక బ్రహ్మ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులతో సరస్వతీ దేవి పూజ చేయించారు. 

అనంతరం ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి ప్రతినిధులు విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, స్కేళ్లు, పెన్సిళ్లు, రబ్బర్లు, చాక్‌మార్కర్లు వితరణ చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
భక్తులకు విస్తృత ఏర్పాట్లు :
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ గురురాజు బృందం, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయగా, అగ్నిమాపక శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. గుడివాడ రూరల్ సీఐ ఎస్.ఎల్.ఆర్. సోమేశ్వరరావు ఆధ్వర్యంలో గుడ్లవల్లేరు ఎస్‌ఐ కొండపల్లి సురేష్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, సభ్యులు తూము రాజ్యలక్ష్మి, గుడ్లవల్లేటి వాణి, కళ్లేపల్లి సుగుణశేఖర్, వడ్లమూడి రవీంద్రబాబు, పెద్దిబోయిన శ్యామలాదేవి, నూతలపాటి లక్ష్మీ పావని, ఉస్తేల కోటేశ్వరమ్మ, పెన్నేరు వీర వెంకట నాగలీలాశేఖర్, ఎక్స్-అఫీషియో సభ్యుడు రుద్రపాక శరశ్చంద్ర శివ సంతోష్ శర్మ తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.


| ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు : |
శుక్రవారం మధ్యాహ్నం శ్రీ విజయదుర్గా మహిళా కోలాట సమాజం, గుడివాడ వారిచే మహిళా కోలాటం, శ్రీ వేణుగోపాల భజన సమాజం, వడ్లమన్నాడు వారిచే భజన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి సాయంకాలార్చన, ఊంజల్ సేవ, పంచహారతులు, మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. రాత్రి మహి కూచిపూడి నాట్యాలయం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన, విజయవాడ కళాబృందాలచే ‘మోహిని విజయం’ సీను, ‘మోహిని భస్మాసుర’ నాటకం ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.
18న కుంభం, గ్రామోత్సవం.. 30 వేల మందికి అఖండ అన్నసమారాధన :
ఈ నెల 18వ తేదీ ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయంలో కుంభం పోయుట, గ్రామోత్సవం, అఖండ అన్నసమారాధన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సుమారు 30,000 మంది భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్నప్రసాదాల కోసం రూ.21 వేల విరాళం :
శ్రీ కొండలమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ప్రసాదం పంపిణీ నిమిత్తం రామన్నపూడికి చెందిన ఆయుష్య ఫుడ్స్ అధినేత వెనుగండ్ల లక్ష్మీ ప్రసన్న, ఓజీఎన్‌ఐ ఎస్కో ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వెనిగండ్ల మదన్ కిషోర్ కలిసి రూ.21,000 విరాళంగా సమర్పించారు. దాతలను ఆలయ చైర్మన్ ఈడే మోహన్, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు శేషవస్త్రాలతో సత్కరించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
అమ్మవారి నైవేద్యానికి రూ.20,116 విరాళం :
ఈ నెల 18న దుర్గాష్టమి సందర్భంగా స్వయంభు శ్రీ కొండలమ్మ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పాయసం తయారీ కోసం కలిగొట్లకు చెందిన చింతలపాటి గంగరాజు రూ.20,116 విరాళంగా అందజేశారు. దాతను ఆలయ చైర్మన్ ఈడే మోహన్, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు శేషవస్త్రంతో సత్కరించి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
