Gudlavalleru : కొండలమ్మ సన్నిధిలో భక్తిభావం.. కాత్యాయనీ దేవిగా అమ్మవారి దర్శనం
- ఆదివారం 30 వేల మందికి అఖండ అన్నసమారాధన.. దాతల నుంచి భారీగా బియ్యం విరాళాలు
కృష్ణా : గుడ్లవల్లేరు/వేమవరం (స్వచ్ఛవార్త) :
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారు కాత్యాయనీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆలయ ప్రధాన అర్చకులు ఆర్.ఎస్.సి.ఎస్. సంతోష్ శర్మ ఆధ్వర్యంలో సహస్రనామార్చన, కుంకుమ పూజలు, హోమాలు నిర్వహించారు. త్వరిత వివాహం, కుజదోష పరిహారం కోసం కాత్యాయనీ మూలమంత్ర హవనాలు జరిపారు. అనంతరం భక్తులకు ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అన్నసమారాధనకు భారీగా బియ్యం విరాళాలు :
ఆదివారం (అక్టోబర్ 18) నిర్వహించనున్న అఖండ అన్నసమారాధనలో సుమారు 30 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి గుడివాడకు చెందిన ఆచంట కావ్యశ్రీ 593 కిలోలు, గుమ్మడి దుర్గకుమార్, సౌజన్య సుధ 500 కిలోలు, గుడివాడకు చెందిన మండలి ధమన్ 100 కిలోల బియ్యాన్ని విరాళంగా అందించారు.
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు :
ఉత్సవాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో హోమియో వైద్య శిబిరం, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ ఔట్‌పోస్టు ఏర్పాటు చేయగా, అగ్నిమాపక శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. ఆదివారం జరగనున్న గ్రామోత్సవం, అఖండ అన్నసమారాధన ఏర్పాట్లను గుడ్లవల్లేరు ఎస్‌ఐ కొండపల్లి సురేష్ సిబ్బందితో కలిసి పరిశీలించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు :
శనివారం మధ్యాహ్నం కొండిపాలెం శ్రీ శివశక్తి అయ్యప్ప స్వరార్చన బృందం ఆర్కెస్ట్రా భజన కార్యక్రమం నిర్వహించింది. సాయంత్రం సాయంకాలార్చన, ఉంజల్ సేవ, పంచహారతులు, మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. రాత్రి విజయవాడకు చెందిన కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం రాత్రి మహి కూచిపూడి నాట్యాలయం బృందం నృత్య ప్రదర్శనతో పాటు విజయవాడ కళాకారులు ‘మోహిని విజయం’, ‘మోహిని భస్మాసుర’ నాటకాలను ప్రదర్శించారు.




