Gudlavalleru : గజలక్ష్మీ దేవి అలంకరణలో శ్రీ కొండలమ్మ అమ్మవారు
- శరన్నవరాత్రులలో ఆలయానికి భక్తుల తాకిడి.. ప్రత్యేక పూజలు, హోమాలు
కృష్ణాజిల్లా : గుడ్లవల్లేరు/వేమవరం (స్వచ్ఛవార్త) :మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆశ్వయుజ శుద్ధ తదియ సందర్భంగా అమ్మవారు శ్రీ గజలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోగా, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మంగళవారం ఓ ప్రకటనలో ఉత్సవాల వివరాలను తెలిపారు
ఈ సందర్భంగా ఆలయంలో సహస్రనామార్చన, సమస్త లక్ష్మీ ప్రాప్తి కోసం శ్రీ సూక్తం, లక్ష్మీ సూక్తం, పురుషసూక్త హవనాలు నిర్వహించారు. భక్తులు కుంకుమ పూజలు, హోమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, సభ్యులు కళ్లేపల్లి సుగుణ శేఖర్, మన్నెం వీర నాగేంద్రరావు, వడ్లమూడి రవీంద్రబాబు, నూతలపాటి లక్ష్మీ పావని, పెన్నేరు వీర వెంకట నాగ లీల శేఖర్, ఎక్స్-అఫీషియో సభ్యుడు రుద్రపాక శరశ్చంద్ర శివ సంతోష్ శర్మ ఆలయంలో ఏర్పాట్లను పర్యవేక్షించి, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
భక్తులకు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు :
శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ గురురాజు ప్రభుత్వ ఉచిత హోమియో వైద్య శిబిరంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయగా, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.
ప్రసాదాల పంపిణీకి భక్తుల విరాళాలు :
వేమవరం గ్రామానికి చెందిన మన్నెం రామ్మోహనరావు భక్తులకు ప్రసాదాల పంపిణీ నిమిత్తం రూ.5,000 విరాళంగా అందజేశారు. అలాగే ఈ నెల 15న ప్రసాదాల పంపిణీ కోసం విజయవాడకు చెందిన పమ్మిడి మౌనిక విజయ్ రూ.5,000 విరాళంగా అందించనున్నట్లు దేవస్థానం ప్రకటించింది.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు :
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 11 గంటలకు విజయవాడకు చెందిన కనకదుర్గ కోలాట భజన మండలి కోలాట ప్రదర్శన, మధ్యాహ్నం 12 గంటలకు వేమవరం శ్రీ విఘ్నేశ్వర భజన బృందం భజన కార్యక్రమం, మధ్యాహ్నం 3 గంటలకు గుడివాడకు చెందిన శ్రీ చిన్ని కృష్ణ మహిళా కోలాట బృందం ప్రదర్శనలు నిర్వహించాయి.
సాయంత్రం 5.30 గంటల నుంచి సాయంకాలార్చన, ఉంజల్ సేవ, పంచహారతులు, మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
రాత్రి 7.30 గంటలకు శ్రీ అరుణాచలేశ్వర నాట్యాలయం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన, 8.30 గంటలకు చొరంపూడి శ్రీ షిరిడీ సాయి నాట్యమండలి ఆధ్వర్యంలో సత్యహరిశ్చంద్ర నాటకంలోని కాటి సీను, 9.30 గంటలకు చిన్నాపురం శ్రీ బాల సరస్వతి నాట్యమండలి ఆధ్వర్యంలో దేవనర్తకి నాటక ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.






