Gudlavalleru : గాయత్రీ దేవి అలంకరణలో కొండలమ్మ దర్శనం.. శరన్నవరాత్రుల్లో భక్తుల సందడి
- మహా అన్న సమారాధనకు 325 కిలోల బియ్యం విరాళం...
కృష్ణా : గుడ్లవల్లేరు/వేమవరం (స్వచ్ఛవార్త) :
శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, గాయత్రీ మూలమంత్ర హవనం నిర్వహించారు. 

పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసరాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టడంతో పాటు పోలీసు ఔట్‌పోస్ట్, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.



ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, ధృవీకరణ పత్రం అందజేత :
ఉత్సవాల్లో భాగంగా వివిధ భజన బృందాల ప్రదర్శనలు నిర్వహించారు. రాత్రి శివ జ్యోతి నాట్యాలయం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన, గుడివాడ కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆదివారం రాత్రి మచిలీపట్నానికి చెందిన శ్రీ బాల త్రిపుర సుందరి నృత్యనికేతన్ కూచిపూడి నృత్య ప్రదర్శన, ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ నాటకంలోని ఘట్టం, జైశ్రీ ఆదర్శ కళానాటక మండలి ఆధ్వర్యంలో పోతులూరి వీరబ్రహ్మం జీవిత చరిత్ర ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నాయి.
మహా అన్న సమారాధనకు బియ్యం విరాళాలు :
ఈ నెల 18న నిర్వహించనున్న అఖండ మహా అన్న సమారాధనకు ముగ్గురు దాతలు మొత్తం 325 కిలోల బియ్యాన్ని విరాళంగా అందించారు. గుంటా కోడేరు గ్రామానికి చెందిన డొక్కు ఉపేంద్ర 25 కిలోలు, కూచికాయలపూడికి చెందిన పొట్లూరి ఈశ్వర్‌రావు మనవడు లిఖిత్ 200 కిలోలు, విజయవాడకు చెందిన ఆర్. గౌరీ శిరీష కుమార్ 100 కిలోల బియ్యాన్ని సమర్పించారు. అన్న సమారాధనకు భక్తులు వస్తు రూపంలోగానీ, ధన రూపంలోగానీ విరాళాలు అందించి సహకరించాలని ఈవో కోరారు.
ఉత్సవాల ఏర్పాట్లను దేవస్థాన చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహన్ రావు, ఈవో ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యుడు రుద్రపాక శరశ్చంద్ర శివ సంతోష్ శర్మ పర్యవేక్షించారు.
