Gudlavalleru : కొండలమ్మ సన్నిధిలో కనకదుర్గాదేవి అలంకరణ.. దుర్గాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల
- 30 వేల మందికి అన్నసమారాధన.. వైభవంగా గ్రామోత్సవం
కృష్ణా : గుడ్లవల్లేరు/ వేమవరం (స్వచ్ఛవార్త) :
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం దుర్గాష్టమిని పురస్కరించుకుని అమ్మవారు శ్రీ కనకదుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాలు, గ్రామోత్సవం, అన్నసమారాధన కార్యక్రమాలు వైభవంగా జరిగాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.


హైదరాబాద్ కళాకారుల బోనాల నృత్యాలు, ఇతర రాష్ట్రాల కళాకారుల పూణేడప్పుల ప్రదర్శనలు, మొగల్తూరు కళాకారుల గరగ నృత్యం, తీన్మార్ వాయిద్యాలు, బ్యాండ్ మేళం, సన్నాయి బృందాల ప్రదర్శనల నడుమ అమ్మవారి గ్రామోత్సవం ప్రారంభమైంది. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సుమారు 30 వేల మందికి అన్నసమారాధన నిర్వహించారు.
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అమ్మవారిని దర్శించుకుని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహన్ రావు, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ముఖ్య అర్చకుడు ఆర్.ఎస్.సి.ఎస్. సంతోష్ శర్మ ఏర్పాట్లను పర్యవేక్షించి పూజలు, హోమాల్లో పాల్గొన్నారు.
గ్రామోత్సవం, అఖండ అన్నసమారాధన కార్యక్రమాల సందర్భంగా గుడివాడ డీఎస్పీ బాల శ్రీనివాసరావు, గుడివాడ రూరల్ సీఐ సోమేశ్వరరావు, గుడ్లవల్లేరు ఎస్‌ఐ కొండపల్లి సురేష్ తమ సిబ్బందితో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.





