Kaikaluru Rural Circle : స్థానిక ఎన్నికల వేళ గ్రామాలపై నిరంతర నిఘా ఉంచాలి.. మహిళా పోలీసులకు కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్ సూచనలు
ఏలూరు జిల్లా : కైకలూరు రూరల్ సర్కిల్ (స్వచ్ఛవార్త) :
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మహిళా పోలీసులు తమ పరిధిలోని గ్రామాల్లో నిరంతరం పర్యటిస్తూ, పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించి సమాచారాన్ని సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేయాలని కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్ సూచించారు. మంగళవారం కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో రూరల్ సర్కిల్ పరిధిలోని కలిదిండి, మండవల్లి, కైకలూరు రూరల్, ముదినేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను నిరంతరం పరిశీలించాలని సీఐ సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు సమాచారాన్ని సేకరించి, వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు.
గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని, ప్రజలతో సమన్వయంగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా మహిళా పోలీసులు అప్రమత్తంగా ఉండి, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సీఐ వి. రవికుమార్ సూచించారు.
