Kaikaluru Rural Circle : స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పోలీసుల పర్యటన.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలకు పలు సూచనలు
ఏలూరు జిల్లా : కైకలూరు రూరల్ సర్కిల్ (స్వచ్ఛవార్త) :
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పరిధిలో ప్రశాంతకార వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ ప్రశాంత్ కిషోర్ ఆదేశాల మేరకు డి.ఎస్.పి శ్రవణ్ కుమార్ సూచనలతో కైకలూరు రూరల్ సీఐ వి రవికుమార్ పర్యవేక్షణలో గురువారం కైకలూరు రూరల్ సర్కిల్ పరిధి లోని కైకలూరు రూరల్, ముదినేపల్లి, కలిదిండి, మండవల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ఆయా పోలీసు స్టేషన్ల అధికారులు పర్యటించి ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజలకు సూచనలు చేశారు.
కైకలూరు రూరల్ ఎస్సై వి. రాంబాబు సీతనపల్లి, దొడ్డిపట్ల గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులకు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే ముదినేపల్లి మండలంలోని అల్లూరు, బొమ్మినంపాడు గ్రామాల్లో కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్, ముదినేపల్లి ఎస్సై టి. సాయి శ్రీనివాస్ పర్యటించి గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఎన్నికల పరిస్థితులను అడిగి తెలుసుకుని, ఎలాంటి వివాదాలు, ఘర్షణలకు తావివ్వకుండా సంయమనం పాటించాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

కలిదిండి మండలంలోని చిన్న తాగినాడ గ్రామంలో ఎస్సై ఎస్.ఎస్. పవన్ కుమార్ పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరించడం, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే సందేశాలు వ్యాప్తి చేయరాదని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని తెలిపారు.
మండవల్లి మండలంలోని పుట్లచెరువు గ్రామంలో ఎస్సై సీహెచ్. రామచంద్రరావు పర్యటించి గ్రామస్తులకు ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా, గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు.
స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని అధికారులు కోరారు.


