Kaikaluru : ఎంపీడీవో కార్యాలయాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు.. ఎంపీటీసీ నామినేషన్లకు భద్రత.. ఎన్నికల విధులపై సిబ్బందికి శిక్షణ
ఏలూరు జిల్లా: కైకలూరు నియోజకవర్గం (స్వచ్ఛవార్త):
నియోజకవర్గ పరిధిలో ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్ తెలిపారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.


నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.
ఎన్నికల విధులపై సిబ్బందికి శిక్షణ :
రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కైకలూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ శాఖల సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎన్నికలకు ముందు రోజు, పోలింగ్ రోజున బ్యాలెట్ బాక్సుల పంపిణీ, పోలింగ్ సిబ్బంది వాటిని స్వీకరించే విధానం, పోలింగ్ అనంతరం రూట్ల వారీగా నిర్దేశిత స్ట్రాంగ్ రూమ్‌కు సురక్షితంగా తరలించే ప్రక్రియపై అవగాహన కల్పించారు.
ఎన్నికల సామగ్రి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిబంధనలను పాటిస్తూ సమన్వయంతో విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని తెలిపారు.
