Kaikaluru : కైకలూరులో టిప్పర్ బీభత్సం.. తాత మృతి, మనవడికి గాయాలు
ఏలూరు జిల్లా : కైకలూరు టౌన్ (క్రైమ్), స్వచ్ఛవార్త :
మనవడిని పాఠశాలలో దింపేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మృతుని మనవడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఏలూరు జిల్లా కైకలూరు ప్రభుత్వ జడ్పీ పాఠశాల సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. కైకలూరు మండలం ఆటపాక గ్రామానికి చెందిన ముంగర దుర్గాప్రసాద్ (60) తన ఐదేళ్ల మనవడు మోక్షిత్ పవన్‌ను కైకలూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో దింపేందుకు శుక్రవారం ఉదయం స్కూటీపై బయలుదేరాడు. ప్రభుత్వ పాఠశాల సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ (ఏపీ 07 టీఎఫ్ 4466) స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ రోడ్డుపై పడిపోగా, టిప్పర్ లారీ అతని తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మనవడు మోక్షిత్ పవన్ రోడ్డుకు అవతలి వైపు పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
సమాచారం అందుకున్న కైకలూరు పట్టణ ఇన్స్పెక్టర్ ఏవీఎస్ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. స్థానికుల సహకారంతో మృతదేహాన్ని కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు దుర్గాప్రసాద్‌కు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.
