Kaikaluru : ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అధికారుల సమన్వయం
- కైకలూరు ఎంపీడీవో కార్యాలయంలో అధికారుల సమన్వయ భేటీ
- పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు, బ్యాలెట్ బాక్సుల పంపిణీపై దిశానిర్దేశం
ఏలూరు జిల్లా : కైకలూరు (స్వచ్ఛవార్త) :
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం కైకలూరు ఎంపీడీవో కార్యాలయంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కైకలూరు నియోజకవర్గ పరిధిలోని వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూత్‌ల వద్ద కల్పించాల్సిన ప్రాథమిక సౌకర్యాలు, బ్యాలెట్ బాక్సుల సురక్షిత పంపిణీ, రూట్ నంబర్ 4కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు నిరంతరం సమన్వయం పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో కైకలూరు ఎంపీడీవో, తహసీల్దార్, కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్, కైకలూరు ఎస్సై వి. రాంబాబుతో పాటు పలు శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
