Kaikaluru : కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి : ఎమ్మెల్సీ జయమంగళ
ఏలూరు జిల్లా : కైకలూరు (స్వచ్ఛవార్త) :
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఐక్యతను చాటుతూ జనసేన పార్టీ ఆశావహులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నారని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తెలిపారు. మంగళవారం ఆటపాకలోని తన కార్యాలయంలో జనసేన నాయకులు చనుమోలు చంద్రశేఖర్, కొల్లి వరప్రసాద్ (బాబీ), దాసరి రమేష్‌లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పార్టీ పిలుపు మేరకు కైకలూరు నియోజకవర్గంలో బలమైన స్థానాల్లో పోటీ చేసేందుకు పలువురు జనసేన నాయకులు జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారని వివరించారు. అయితే, పార్టీ తరఫున బీ-ఫారాలు పొందిన అభ్యర్థులకే అవకాశం కల్పిస్తూ, మిగిలిన ఆశావహులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారని తెలిపారు. అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆశావహులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున 16 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు జయమంగళ వెంకటరమణ వెల్లడించారు. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఐక్యత కొనసాగించడం ముఖ్యమని, ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నామినేషన్లు ఉపసంహరించుకున్న ఆశావహులను అభినందించారు. వారికి భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని తెలిపారు.
సమావేశంలో ముమ్మారెడ్డి నాగమల్లేశ్వరరావు, బూరుబోయిన శ్రీనివాసరావు, బోడావుల రవీంద్రరాజు, తులసీ పూర్ణ, మునగాల పృథ్వీ, మంగినేని రామకృష్ణ, పెరుగు నాగరాజు, విజయకుమార్, ఇంటి రఘు తదితరులు పాల్గొన్నారు.
