Machilipatnam : ఈడేపల్లిలో ఘనంగా ప్రపంచ వృద్ధుల దినోత్సవం వేడుకలు.. వృద్ధుల కళ్ళల్లో ఆనందం నింపిన వెలుగు ఫౌండేషన్
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :
వృద్ధులు దేశానికి అమూల్యమైన సంపద అని, 60 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తి ఒక చరిత్ర పుస్తకం వంటివారని మచిలీపట్నం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. లీలా ప్రసాద్ అన్నారు. వారి ముడతల వెనుక ఎన్నో జీవిత పాఠాలు, చిరునవ్వు వెనుక అనేక త్యాగాలు దాగి ఉంటాయని పేర్కొన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులను సన్మానించడం మాత్రమే కాకుండా, వారి ఆరోగ్యం, ఆత్మగౌరవం, సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈడేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు చందమామ బాబు ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ వృద్ధుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ టి. లీలా ప్రసాద్ మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండేందుకు తేలికపాటి వ్యాయామం, మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని సూచించారు. వృద్ధుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు.చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ టి. ఉష్మ మాట్లాడుతూ.. తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటూ, ఎన్నో త్యాగాలు చేసిన మాతృమూర్తులు, పితృదేవులు అభినందనీయులన్నారు. వృద్ధులను గౌరవించడం, వారి పట్ల మానవత్వంతో మెలగడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెలుగు ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.
ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ.. వృద్ధాశ్రమంలో జీవించాల్సి వచ్చినంత మాత్రాన వృద్ధులు నిరాశ, నిస్పృహలకు లోనుకావాల్సిన అవసరం లేదన్నారు. ఉత్సాహంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. పండుగలు, పర్వదినాల సందర్భంగా వృద్ధాశ్రమానికి వచ్చి వారితో ఆనందాన్ని పంచుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా వృద్ధుల చేత కేక్ కట్ చేయించి, పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. వృద్ధులకు అవసరమైన సబ్బులు, టూత్‌పేస్టులు తదితర సామగ్రిని వెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు చందమామ బాబు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. డాక్టర్ టి. ఉష్మ సుమారు రూ.30 వేల విలువైన మందులను వృద్ధాశ్రమం నిర్వహణకు అందించారు.
వృద్ధుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ టి. లీలా ప్రసాద్, డాక్టర్ టి. ఉష్మ, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ తోట వీరేంద్రనాథ్ తదితర వైద్యులు వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.
కార్యక్రమంలో వైద్య, సంక్షేమ శాఖ అధికారులు కళ్యాణి, లక్ష్మీ దుర్గ, వీవీఎస్ రమేష్, వెలుగు ఫౌండేషన్ ఉపాధ్యక్షులు రేపల్లె వెంకట వీర వసంతరావు, డీజే జగ్గారావు, నారాయణపురం పీహెచ్‌సీ సిబ్బంది, వృద్ధాశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
