Machilipatnam : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి – జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు
కృష్ణా : జిల్లా పోలీస్ కార్యాలయం (స్వచ్ఛవార్త) :
కృష్ణాజిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అనంతరం, తదుపరి నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియకు బ్యాలెట్ బాక్సుల భద్రత, కౌంటింగ్ సరళికి సంబంధించి కృష్ణా యూనివర్సిటీ, పెడన పల్లోటి స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఈరోజు పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది సంఖ్య, సిబ్బంది విధుల కేటాయింపు, నిరంతర నిఘా తదితర అంశాలను ఎస్పీ గారు క్షుణ్ణంగా సమీక్షించారు. బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ కు తరలించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కౌంటింగ్ సమయంలో వచ్చే ప్రజల వాహనాలు పార్కింగ్ విషయంలో చేపట్టవలసిన చర్యలను గూర్చి తెలిపారు.
అదేవిధంగా, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలిస్తూ, కౌంటింగ్ కేంద్రాల్లో బెంచీల ఏర్పాటు, అభ్యర్థులు మరియు వారి ప్రతినిధులు కూర్చునేందుకు అవసరమైన సదుపాయాలు, పోలీసు బందోబస్తు, రాకపోకల నియంత్రణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ, కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
