📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : దశాబ్దాల సమస్యలకు కూటమి ప్రభుత్వంలో పరిష్కారం : మంత్రి కొల్లు రవీంద్ర


కృష్ణా జిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం రూరల్ మండలం సీతారాంపురంలో ఆయన పర్యటించారు. వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేయడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలతో ఏర్పాటు చేసిన ప్రగతి రథాన్ని పరిశీలించారు.

త్వరలో అన్ని గ్రామాల్లో మురుగునీటి కాలువలను శుభ్రం చేసి, తాగునీటి పైప్‌లైన్ పనులను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. గత ఏడాది రూ.54 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మరో రూ.80 కోట్ల పనులకు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్‌లో జరుగుతున్న వాటర్ పైప్‌లైన్ మరమ్మతులు, రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించి, నాణ్యతతో పాటు పనుల వేగంపై అధికారులను ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

సీతారాంపురంలో రూ.14.70 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ సభలో పాల్గొని గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలతో చర్చించారు. గ్రామంలో 870 మంది రైతులకు రూ.1.20 కోట్ల మేర అన్నదాత సుఖీభవ, 254 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, 215 మందికి తల్లికి వందనం, 16 మందికి ఆటోడ్రైవర్ల సేవలో, 27 మందికి హార్టికల్చర్ ద్వారా ఆర్థిక సాయం అందుతోందని తెలిపారు. రూ.88 లక్షలతో మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికీ కుళాయి వంటి మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు.

బందరు పోర్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఒక సంస్థను ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించేందుకు ఏడాది పాటు కృషి చేశామని, దాని ద్వారా రూ.8 వేల కోట్ల పెట్టుబడితో పాటు సుమారు 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. దీనికి అనుబంధంగా మరో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు.

జీ రాంజీ పథకం ద్వారా మంజూరైన రూ.44 లక్షల విలువైన పనులకు శంకుస్థాపన చేశామని, పల్లె పండుగ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.11 వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గ్రామ స్వరాజ్యానికి ప్రాధాన్యమిస్తూ తాగు, సాగునీటి పథకాలను ప్రారంభిస్తున్నామన్నారు. మచిలీపట్నానికి రూ.80 కోట్లు మంజూరు కావడం సంతోషకరమని, వైద్యారోగ్య రంగంలో మార్పుల్లో భాగంగా ఈ ప్రాంతానికి మూడు పీహెచ్‌సీలు మంజూరయ్యాయని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి అన్నారు. హార్టికల్చర్‌పై ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నామని, ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఒక బ్యారేజీ, దిగువన మరో బ్యారేజీ నిర్మించాలనే ప్రతిపాదన ఉందని తెలిపారు. ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా అభివృద్ధిని చేతల్లో చూపిస్తోందన్నారు.

కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, రూరల్ పార్టీ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం