Machilipatnam : ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ సూచనలు
కృష్ణా జిల్లా పోలీస్ : మచిలీపట్నం (స్వచ్ఛవార్త) :
రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 14-10-2026 వ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇది అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అలాగే నామినేషన్ కేంద్రాల వద్ద 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉంటుందని నామినేషన్ వేయడానికి ముగ్గురికి మించి రావద్దని స్పష్టం చేశారు.
ఎన్నికలు నిర్వహించి తేదీలు సంబంధిత వివరాలు
మున్సిపల్ కార్పొరేషన్/ మున్సిపాలిటీ ఎన్నికలు మచిలీపట్నం,పెడన, మరియు ఉయ్యూరు
28-10-2026 పోలింగ్
30 -10-2026 కౌంటింగ్
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మొత్తం పోలింగ్ స్టేషన్స్ 241, పోలింగ్ లొకేషన్స్ 100.
MPTC/ZPTC ఎన్నికలలో మొత్తం ఎంపీటీసీ 358, జడ్పిటిసి 26 స్థానాలకు
3-11-2026 పోలింగ్
5-11-2026 కౌంటింగ్
ఎంపిటిసి ఎంపిటిసి ఎన్నికలకు మొత్తం పోలింగ్ స్టేషన్స్ 1264, పోలింగ్ లొకేషన్స్ 748.
గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు విడతల లో నిర్వహించనున్న ఎన్నికలు.
మొదటి విడత గుడివాడ రెవెన్యూ డివిజన్
26-11-26 పోలింగ్, కౌంటింగ్.
మొత్తం గ్రామపంచాయతీలు 160 వార్డులు 1424
పోలీస్ స్టేషన్స్ 1503
పోలింగ్ లొకేషన్స్ 395
రెండో విడత ఉయ్యూరు డివిజన్ గ్రామ పంచాయతీ ఎన్నికలు
29-11-26 పోలింగ్ మరియు కౌంటింగ్.
మొత్తం పంచాయతీలు 124
వార్డులు 1248
పోలింగ్ స్టేషన్స్ 1300
పోలింగ్ లొకేషన్స్ 349
మూడవ దశ మచిలీపట్నం డివిజన్ గ్రామపంచాయతీ ఎన్నికలు
02-12-2026 పోలింగ్, కౌంటింగ్
మొత్తం గ్రామపంచాయతీలు 213 వార్డులు 1978
పోలింగ్ స్టేషన్స్ 2110
పోలింగ్ లొకేషన్స్ 520
పాటించవలసిన ప్రవర్తనా నియమాలు :
1. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రజల్లో ఇప్పటికే ఉన్న విభేదాలను తీవ్రతరం చేయడం, పరస్పర ద్వేష భావాలను రెచ్చగొట్టడం చేయరాదు.
2. కులాలు, మతాలు, భాషల మధ్య విభేదాలు సృష్టించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.
3. దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనా మందిరాలను ఎన్నికల ప్రచార వేదికలుగా ఉపయోగించరాదు.
4. అభ్యర్థుల ప్రజా జీవితానికి సంబంధం లేని వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేయరాదు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదు.
5. పోటీ చేసే అభ్యర్థుల నివాసాల వద్ద వారి అభిప్రాయాలు లేదా కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు, పికెటింగ్ నిర్వహించరాదు.
6. భవన యజమాని, సంబంధిత అధికారుల నుంచి అవసరమైన ముందస్తు లిఖితపూర్వక అనుమతులు పొందకుండా ప్రభుత్వ లేదా ప్రైవేటు భవనాలపై పార్టీ జెండాలు కట్టడం, పోస్టర్లు అతికించడం, నినాదాలు రాయడం చేయరాదు.
7. అనుమతులు పొందిన సందర్భాల్లో సంబంధిత అనుమతి పత్రాల ప్రతులను ఎన్నికల అధికారులకు సమర్పించాలి.
8. ఇతర రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులు ఏర్పాటు చేసిన జెండాలు, పోస్టర్లను తొలగించడం లేదా ధ్వంసం చేయడం చేయరాదు.
2. ఎన్నికల చట్టం ప్రకారం నిషేధిత కార్యకలాపాలు :
1. కులం, మతం, వర్గం ఆధారంగా ఓట్లు వేయాలని లేదా వేయవద్దని కోరరాదు. మతపరమైన గుర్తులను ఉపయోగించి ఓట్లు అభ్యర్థించరాదు.
2. ముద్రించిన వారి, ప్రచురణకర్త పేర్లు, చిరునామాలు పేర్కొనకుండా పోస్టర్లు, కరపత్రాలు, పాంప్లెట్లు, సర్క్యులర్లు లేదా ప్రకటనలను ముద్రించడం, ప్రచురించడం చేయరాదు.
3. అభ్యర్థి ఎన్నికల అవకాశాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అతని వ్యక్తిగత ప్రవర్తన లేదా నడవడికపై తప్పుడు, అవాస్తవ ప్రకటనలు లేదా వార్తలను ప్రచురించరాదు.
4. ఇతర రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులు ఏర్పాటు చేసిన ఎన్నికల సమావేశాలకు ఆటంకం కలిగించరాదు.
5. ఓటర్లకు నగదు, బహుమతులు, లంచాలు లేదా ఇతర ప్రలోభాలు ఇవ్వడం, ఇవ్వజూపడం చేయరాదు.
6. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఓట్ల కోసం ప్రచారం చేయడం లేదా ఓటర్లను అభ్యర్థించడం చేయరాదు.
7. ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లడానికి లేదా అక్కడి నుంచి తీసుకురావడానికి నిషేధిత ప్రయాణ సౌకర్యాలు కల్పించరాదు.
8. పోలింగ్ కేంద్రంలో లేదా దాని పరిసరాల్లో క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తించడం, పోలింగ్ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం చేయరాదు.
9. ఇతర ఓటర్ల పేర్లతో ఓట్లు వేయడానికి ప్రయత్నించరాదు.
10. ఇతర రాజకీయ పార్టీలు లేదా నాయకుల దిష్టిబొమ్మలను ఊరేగించడం, తగులబెట్టడం లేదా ఇతర రూపాల్లో ప్రదర్శించడం చేయరాదు.
3. బహిరంగ సభలు, ఊరేగింపులపై నిషేధ కాలం:
1. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి.
2. జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తుల ఎన్నికలకు పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి.
3. గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి.
సంబంధిత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే తాజా ఉత్తర్వులు, నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని తెలిపారు.
4. బహిరంగ సమావేశాలు, లౌడ్‌స్పీకర్ల వినియోగం :
1. సంబంధిత అధీకృత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందకుండా బహిరంగ సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదు.
2. అనుమతి లేకుండా లౌడ్‌స్పీకర్లను ఉపయోగించరాదు. వాటిని అనుమతించిన ప్రయోజనాలకే వినియోగించాలి.
3. అనుమతి పొందిన బహిరంగ సమావేశాలు, రోడ్‌షోల వద్ద లౌడ్‌స్పీకర్ల వినియోగ సమయాలు, ఇతర సందర్భాల్లో వర్తించే సమయ పరిమితులను సంబంధిత అధికారిక ఉత్తర్వుల ప్రకారం పాటించాలి.
4. నిబంధనలను ఉల్లంఘించి లౌడ్‌స్పీకర్లను ఉపయోగిస్తే, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటారు.
5. ఆసుపత్రులు, వైద్యశాలల పరిసరాల్లో రోగులకు అసౌకర్యం కలగకుండా శబ్ద కాలుష్యాన్ని నివారించాలి.
5. ఊరేగింపుల నిర్వహణలో పాటించాల్సిన నియమాలు :
1. ఊరేగింపు తేదీ, ప్రారంభ సమయం, మార్గం, ముగింపు ప్రదేశాన్ని ముందుగానే నిర్ణయించాలి.
2. ఊరేగింపు వివరాలను స్థానిక పోలీసు అధికారులకు ముందస్తుగా తెలియజేయాలి.
3. ఊరేగింపు మార్గంలో అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పాటించాలి. మినహాయింపులు అవసరమైతే సంబంధిత అధీకృత అధికారుల అనుమతి పొందాలి.
4. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
5. పొడవైన ఊరేగింపులను అవసరాన్ని బట్టి చిన్న భాగాలుగా నిర్వహించి, రోడ్డు కూడళ్ల వద్ద ట్రాఫిక్ రద్దీని నివారించాలి.
6. సాధ్యమైనంతవరకు ఊరేగింపులు రోడ్డుకు కుడివైపున సాగేలా క్రమబద్ధీకరించాలి.
7. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఇచ్చే ఆదేశాలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
8. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీలు ఒకే మార్గంలో ఒకే సమయంలో ఊరేగింపులు నిర్వహించాల్సి వస్తే, పరస్పర అవగాహనతో పోలీసుల సహకారం తీసుకుని తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
9. ఊరేగింపులు ఒకదానికొకటి ఎదురుపడకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలి.
10. ఊరేగింపులో పాల్గొనే వ్యక్తులు తీసుకెళ్లే వస్తువులపై నిర్వాహకులు తగిన నియంత్రణ కలిగి ఉండాలి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
6. పోలీసుల సూచనలు – ప్రజలకు విజ్ఞప్తి :
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ఇప్పటివరకు రౌడీలను, అనుమానితులను, షీట్ హోల్డర్స్, గత ఎన్నికలలో గొడవలు, అల్లర్లకు పాల్పడిన వారిని 2387 మందిని గుర్తించి ముందస్తు బైండోవర్ చేయడం జరిగింది.
జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి అనుచరులు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే చర్యలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు, ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు, అనుమతి లేకుండా సభలు లేదా ఊరేగింపుల నిర్వహణ, ఇతర ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలు కూడా ఎన్నికల నిబంధనలను పాటిస్తూ స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల నిర్వహణకు సహకరించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు.
సమస్యాత్మక ప్రాంతాలను మరియు వ్యక్తులను గుర్తించడం జరిగింది.
