Machilipatnam : సముద్రంలో బోటు బోల్తా.. మత్స్యకారుడు గల్లంతు
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :
మచిలీపట్నం మండలం కేపీటీ పాలెంకు చెందిన మత్స్యకారులు శనివారం తోకబోటులో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కృష్ణానది నుంచి తీవ్రంగా ఒరవడి రావడంతో బోటు అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం.
ఈ ఘటనలో తిరుమలశెట్టి పోతురాజు, ఆయన భార్య నాగలక్ష్మి, కుమారుడు గోపిరాజు బోటులో ఉన్నారు. బోటు బోల్తా పడటంతో పోతురాజు, నాగలక్ష్మి కొంతదూరం నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలతో ఒడ్డుకు చేరినట్లు తెలిసింది. అయితే వారి కుమారుడు గోపిరాజు బోటుతో పాటు నదిలో కొట్టుకుపోయి గల్లంతైనట్లు తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన జరిగిన సమయానికి ఆరు గంటలు కావడంతో చీకటి పడటం, నదిలో తీవ్రంగా నీటి ప్రవాహం ఉండటంతో గోపిరాజు ఆచూకీ కోసం గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు గోపిరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. దీంతో గల్లంతైన మత్స్యకారుడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
