Machilipatnam : మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి : జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
- నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశను పకడ్బందీగా నిర్వహించాలి...
- రిటర్నింగ్ అధికారులు ఎన్నికల హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి...
కృష్ణా : మచిలీపట్నం కలెక్టరేట్ (స్వచ్ఛవార్త) :
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అభ్యర్థుల ఉపసంహరణ తదితర అంశాల్లో ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, ప్రతి దశను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు, నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
గురువారం రాత్రి కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వోలు), ఎన్నికల అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నామినేషన్ల స్వీకరణకు తీసుకోవాల్సిన చర్యలు, అవసరమైన ఏర్పాట్లు, ఎన్నికల నిబంధనల అమలుపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
ఎన్నికల నిర్వహణ అనేది పూర్తిగా నిబంధనలకు లోబడి జరిగే ప్రక్రియ అని, అధికారులు తమ వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా కాకుండా ఎన్నికల నియమావళి, అధికారిక హ్యాండ్‌బుక్‌లో పొందుపరిచిన మార్గదర్శకాల ప్రకారమే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సంబంధిత హ్యాండ్‌బుక్‌లను క్షుణ్ణంగా చదివి, నామినేషన్ల స్వీకరణ నుంచి పరిశీలన వరకు అనుసరించాల్సిన విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో తలెత్తే అనేక సందేహాలకు నిబంధనల పుస్తకంలోనే పరిష్కారాలు ఉంటాయని తెలిపారు.
నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఫారాలు, చెక్‌లిస్టులు, ఇతర సామగ్రి ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ప్రతి రిటర్నింగ్ అధికారి తన పరిధిలో సమర్థవంతమైన బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని సమన్వయంతో నిర్వహించేలా సిబ్బందికి విధులు కేటాయించాలని, అవసరమైతే రాతపూర్వకంగా బాధ్యతలు అప్పగించాలని సూచించారు. బృందాల ఏర్పాటు, సిబ్బంది విధుల నిర్వహణలో లోపాలు ఉంటే సంబంధిత మున్సిపల్ కమిషనర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
నామినేషన్ల స్వీకరణకు వచ్చే అభ్యర్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించేందుకు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని, నామినేషన్ పత్రాల్లోని వివరాలు, సంతకాలు, జతచేయాల్సిన ధ్రువపత్రాలు, డిపాజిట్ చెల్లింపు తదితర అంశాలను ముందస్తుగా పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలు, ఎన్నికల వ్యయ ఖాతా, గుర్తుల ఎంపికకు సంబంధించిన ప్రకటనలు, రిజర్వు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు వంటి అంశాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలన్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన పన్నుల బకాయిలు లేవని నిర్ధారించే నో డ్యూస్ సర్టిఫికెట్ల జారీకి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థితో కలిపి గరిష్ఠంగా ముగ్గురినే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతించాలని, నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో వాహనాల నియంత్రణ, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలని, ప్రతి కార్యాలయంలో డిజిటల్ గడియారం ఏర్పాటు చేయాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణకు నిర్ణయించిన గడువును కచ్చితంగా పాటించాలని, గడువు ముగిసిన అనంతరం కార్యాలయంలోకి వచ్చిన వారిని, ముందుగా నిర్ణీత సమయంలో లోపలికి వచ్చిన అభ్యర్థుల విషయంలో వర్తించే నిబంధనలను వేర్వేరుగా పరిగణించి అధికారిక మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేశారు.
అభ్యర్థులు, ప్రతిపాదకుల వివరాలను 2026 జనవరి 1 నాటికి ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా ధ్రువీకరించాలని, సంబంధిత వార్డులో ప్రతిపాదకుడికి ఓటు ఉందో లేదో పరిశీలించాలని తెలిపారు. నామినేషన్ పత్రాల్లో చిన్నపాటి లేఖన సంబంధిత పొరపాట్ల కారణంగా నామినేషన్లను తిరస్కరించకుండా, నిబంధనల ప్రకారం అభ్యర్థులకు తగిన సహకారం అందించాలని సూచించారు. ప్రతి నామినేషన్‌కు వరుస సంఖ్య కేటాయించాలని, రోజువారీగా అందిన నామినేషన్ల వివరాలను నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని, నామినేషన్లు అందని సందర్భంలోనూ ‘నిల్’గా నమోదు చేసి ప్రదర్శించాలని ఆదేశించారు.
స్వీకరించిన ప్రతి నామినేషన్ వివరాలను ఎలక్టోరల్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో అదే రోజు నమోదు చేయాలని, నామినేషన్ పత్రాలు, జతపరిచిన ధ్రువపత్రాలు, డిపాజిట్‌కు సంబంధించిన రికార్డులను రిటర్నింగ్ అధికారి ఆధీనంలో భద్రంగా ఉంచాలని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రోజువారీ నివేదికలను సకాలంలో మున్సిపల్ కమిషనర్లకు పంపాలని, అక్కడి నుంచి జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి, తదుపరి రాష్ట్ర ఎన్నికల అధికారులకు నివేదికలు చేరేలా సమన్వయం పాటించాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం, పురపాలక పరిపాలన శాఖ అందించిన మార్గదర్శకాలు, ప్రజెంటేషన్లు, నమూనా ఫారాలను అధ్యయనం చేసి ముందస్తు సన్నద్ధతతో విధులు నిర్వర్తించాలని తెలిపారు.
ప్రతి అధికారి ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన పెంచుకుని, తమ బృందాలను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించినప్పుడే ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించడం సాధ్యమవుతుందని కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ కే శ్రీధర్ రెడ్డి, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
