Machilipatnam : అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
- ముందస్తు చర్యలు, సహాయక కేంద్రాల ఏర్పాటు, విద్యుత్, తాగునీరు, నిత్యావసర సరుకుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి...
కృష్ణా : మచిలీపట్నం క్యాంపు కార్యాలయం (స్వచ్ఛవార్త) :
అర్నబ్ తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు.
శనివారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తుపాను సన్నద్ధతపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
తుపాను తీరం దాటే ప్రాంతంపై స్పష్టత రావాల్సి ఉన్నందున, అత్యంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ నెల 27వ తేదీ నుంచి తుపాను హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో, ఈ నెల 26వ తేదీ రాత్రి నుంచి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా తమ తమ హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
ప్రమాదకర ప్రాంతాల ప్రజలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. వీలైనంత వరకు పోలింగ్ కేంద్రాలకు వేరుగా సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
చెట్లు కూలి రహదారులకు అంతరాయం కలగకుండా జేసీబీలు, పవర్ యంత్రాలు, ట్రాక్టర్లు సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ శాఖ అదనపు స్తంభాలు, కార్మిక బృందాలు, క్రేన్లు, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తెగిపడిన విద్యుత్ తీగల వల్ల ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
విద్యుత్ అంతరాయం ఏర్పడినా తాగునీటి సరఫరా కొనసాగేందుకు ఓవర్‌హెడ్ ట్యాంకులను ముందుగానే నింపాలని, మొబైల్ టవర్ల జనరేటర్లకు తగినంత డీజిల్ సిద్ధంగా ఉంచాలని తెలిపారు. రేషన్ దుకాణాలకు నిత్యావసర సరుకుల రవాణాను వేగవంతం చేసి, ఆహార కొరత రాకుండా చూడాలన్నారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, కాలువలు, డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించాలని ఆదేశించారు. గర్భిణులు, డయాలసిస్ రోగులు వంటి అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారిని ముందుగానే గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పశువులకు తాగునీరు, పశుగ్రాసం అందుబాటులో ఉంచాలని సూచించారు.
అన్ని మండల, డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, వాటి ఫోన్ నంబర్లను ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజల ప్రాణాలను కాపాడటం, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడటం ప్రధాన లక్ష్యాలుగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
