Machilipatnam : మహాగణపతి ఉత్సవాల విజయంలో మీడియా సహకారం అభినందనీయం.పాత్రికేయుల అభినందన సమావేశంలో మంత్రి కొల్లు
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :
సాగర తీర మహాగణపతి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులు అందించిన సహకారం ఎంతో అభినందనీయమని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మహాగణపతి ఉత్సవాల విశేషాలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేయడంలో మీడియా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
సాగర తీర మహాగణపతి ఉత్సవాల విజయాన్ని పురస్కరించుకుని మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం మచిలీపట్నంలోని సువర్ణ కళ్యాణ మండపంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సాగర తీర మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ..
సాగర తీర మహాగణపతి మహోత్సవాన్ని ప్రజలంతా భాగస్వాములై ఒక అద్భుతమైన కార్యక్రమంగా విజయవంతం చేయడంలో మీడియా అందించిన సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికల ద్వారా ఉత్సవాల విశేషాలు విస్తృతంగా ప్రచారం పొందాయని, పలువురు వ్యక్తిగతంగా కార్యక్రమాలకు హాజరై వీడియోలు రూపొందించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం అభినందనీయమన్నారు.
మచిలీపట్నం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. త్వరలో మచిలీపట్నం తీరానికి పోర్టు రాబోతుండటం, ప్రతిష్టాత్మకమైన గోవా షిప్‌యార్డ్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించడం వంటి పరిణామాలు ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. సుమారు రూ.8 వేల కోట్ల పెట్టుబడులతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాజెక్టులపై ముందడుగు పడుతోందన్నారు.
మచిలీపట్నం భవిష్యత్తులో మహానగరంగా అభివృద్ధి చెందేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. పట్టణ అభివృద్ధిలో ప్రజలు, వ్యాపార వర్గాలు, వివిధ సంస్థలు భాగస్వాములై ‘ఇది మన నగరం, మన బాధ్యత’ అనే భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సాగర తీర మహాగణపతి ఉత్సవాల నిర్వహణలో కమిటీ సభ్యులు, అధికారులు, వివిధ వర్గాల ప్రజలు అందించిన సహకారాన్ని మంత్రి అభినందించారు. ఉత్సవాల్లో వినూత్న లైటింగ్, అలంకరణలు, కార్పెట్ ఏర్పాటు తదితర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు ఉత్సవాలకు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయని తెలిపారు.
ఉత్సవాల విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాలు ముగిశాయని కమిటీ సభ్యులు భావించకుండా మచిలీపట్నం అభివృద్ధి కోసం భవిష్యత్తులోనూ సమష్టిగా పనిచేయాలని సూచించారు. మీడియా ప్రతినిధులు అందించిన సహకారం, ప్రోత్సాహానికి మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో సాగర తీర మహాగణపతి ఉత్సవ కమిటీ చైర్మన్ చలమలశెట్టి నరసింహారావు, కమిటీ ఇతర సభ్యులు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పి జయరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.