Mandavalli : పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : అధికారులకు కలెక్టర్ వెట్రి సెల్వి హెచ్చరిక
ఏలూరు/ మండవల్లి (స్వచ్ఛవార్త) :
ప్రకృతి వైపరీత్యాల అనంతరం పారిశుద్ధ్యం నిర్వహణపై నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. మండవల్లి మండలంలోని పలు గ్రామాలలో గురువారం పర్యటించి పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరాల పునరుద్ధరణ పనులను పరిశీలించి, ప్రతీ ఒక్కరినీ కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండవల్లి మండలం నుచ్చిమిల్లి గ్రామంలో రోడ్లపై మురుగు నీరు నిలిచి ఉండడం, రోడ్లపై చెత్తను తీయించకపోవడంపై పంచాయతీ కార్యదర్శి పద్మ, ఎంపిడిఓ కె. రమణబాబు లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్లపై మురుగు నీరు, చెత్త కారణంగా దోమలు పెరిగి విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలుతాయని, అధికారులు నిర్లక్ష్యం వీడి, తుఫాన్ అనంతరం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. గ్రామంలోని గాలి ప్రవీణ్ బాబు, గాలి డాన్ బాస్, పరిసర గృహాల వారిని విద్యుత్ సరఫరా ఎప్పుడు వచ్చింది, త్రాగునీరు సక్రమంగా వస్తుందా లేదా, తుఫాన్ అప్రమత్తత, విద్యుత్ సరఫరా అంతరాయం గురించి అధికారులు ముందుగానే తెలియజేసారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో త్రాగునీటికి టెస్టింగ్ కిట్లతో పరీక్షించి, సురక్షితంగా ఉందొ లేదో చూడాలన్నారు. 

ఈ సందర్భంగా గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు సక్రమంగా లేవని మంజూరు చేయవలసిందిగా కలెక్టర్ ను గ్రామస్థులు కోరారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజి లు విజిబి రామ్ జి పధకంలో మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆనందపురం, తక్కెళ్లపాడు లో పారిశుద్ధ్యం, విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించి ఆయా గ్రామాలలోని ప్రజలను వారి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ వెంట ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, తహసీల్దార్ బాజీ సత్యనారాయణ, డ్రైనేజి డిఈ రామకృష్ణ, కైకలూరు రూరల్ సిఐ రవికుమార్, వివిధ శాఖల అధికారులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
