Mandavalli : శాంతియుత ఎన్నికలకు పోలీసులకు సహకరించాలి : ఎస్‌ఐ రామచంద్రరావు
ఎన్నికల నియమావళిపై కొవ్వాడ లంకలో అవగాహన సదస్సు...
ఏలూరు జిల్లా : మండవల్లి[క్రైమ్] (స్వచ్ఛవార్త) :
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శనివారం కొవ్వాడ లంక గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రజలు చట్టానికి లోబడి వ్యవహరించాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు పోలీసులకు సహకరించాలని మండవల్లి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ సీహెచ్ రామచంద్రరావు సూచించారు.
సదస్సులో ఎస్‌ఐ మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, ప్రజల బాధ్యతలు, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు వివరించారు. ఎవరూ ప్రలోభాలకు లోనుకాకుండా, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్‌ఐ రామచంద్రరావు తెలిపారు.
