Mudinepalli : భారీ ర్యాలీతో జడ్పీటీసీ అభ్యర్థి బొర్ర చలమయ్య నామినేషన్
- డా.కామినేని శ్రీనివాస్ ఆశీస్సులతో నామినేషన్ దాఖలు.. కూటమి విజయమే లక్ష్యమన్న చలమయ్య...
ఏలూరు జిల్లా : ముదినేపల్లి (స్వచ్ఛవార్త) :
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆశీస్సులతో ముదినేపల్లి మండలం పెనుమల్లి గ్రామానికి చెందిన టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి బొర్ర చలమయ్య కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఏలూరులో ఉత్సాహభరిత వాతావరణంలో భారీ ర్యాలీగా వెళ్లి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కూటమి నాయకులు పరసా ఏడుకొండలు, కట్ట వీర రాఘవులు, కట్ట గోపి, జక్కుల విజయకుమార్, కట్టా నాగబాబు, దాసరి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చలమయ్య మాట్లాడుతూ.. ముదినేపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి ఆశీస్సులతో విజయం సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివృద్ధి పట్ల తన నిబద్ధతను వివరిస్తానన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం, ఐక్యతతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. ప్రజల సహకారంతో భారీ మెజార్టీ సాధించేందుకు కష్టపడి పనిచేస్తానన్నారు. ప్రధానంగా తాగునీరు, డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
