Nuziveedu : అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : తహసీల్దార్ షేక్ షంషుద్దీన్
ఏలూరు జిల్లా : నూజివీడు (స్వచ్ఛవార్త) :
తీవ్ర తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలంతా పూర్తి అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ షేక్ షంషుద్దీన్ సూచించారు. సోమవారం అధికారులు, పంచాయతీ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన, ప్రజలకు పలు రక్షణ సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. లోతట్టు ప్రాంతాలు మరియు పాత ఇళ్లలో నివసించే వారు ముందుజాగ్రత్తగా సమీపంలోని సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. గాలులు, వర్షాల కారణంగా తెగిపడిన విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లకుండా విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పర్యటనలో వీఆర్వో ఎస్. సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి షేక్ రాహీదతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
