T. Narasapuram : శివాలయంలో వైభవంగా కుంకుమ పూజలు.. శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన విశాలాక్షి అమ్మవారు
ఏలూరు జిల్లా : టి.నరసాపురం (స్వచ్ఛవార్త) :
శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం శివాలయంలో కొలువుదీరిన విశాలాక్షి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఆలయ అర్చకులు రవీంద్ర శర్మ భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధన, ధాన్య, ఐశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మీ అమ్మవారిని ఈ పవిత్రమైన నవరాత్రి వేళ దర్శించుకోవడం ఎంతో అదృష్టమని అన్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు.
