📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Vijayawada : ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు

  • నామినేషన్ కేంద్రాల్లో నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు...
  • విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై సస్పెన్షన్, బదిలీ వేటు...

NTR జిల్లా : విజయవాడ (స్వచ్ఛవార్త) :

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై సస్పెన్షన్, బదిలీ వంటి క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడారు.

ఎన్నికల సమయంలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద తగిన భద్రత కల్పించడంతో పాటు సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని, నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థితో పాటు అనుమతించిన ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనల అమలులో ఎలాంటి ఉల్లంఘనలకు అవకాశం ఇవ్వకూడదని సూచించారు.

ఎన్నికల ప్రక్రియలో అధికారులు నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని పునేఠా హెచ్చరించారు. ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పిస్తూ, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం ఏర్పాటుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అన్ని జిల్లాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు : ఐజీ బి. రాజకుమారి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఐజీగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న బి. రాజకుమారి మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు అన్ని జిల్లాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.

ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, క్రిటికల్‌, హైపర్‌ సెన్సిటివ్‌, సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాల పరిధిలో తగిన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆయా జిల్లాల ఎస్పీలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై పోలీసులు తక్షణమే స్పందించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారని చెప్పారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

ఎన్నికల సమయంలో ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరిగినా వెంటనే స్పందించాలని, ముందస్తు జాగ్రత్తలతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు రాజకుమారి తెలిపారు. నామినేషన్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, వీడియో కవరేజ్‌, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లికార్జున పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం